18, మార్చి 2017, శనివారం

కపటాభిమానం


ఆడియో రిలీజ్ అయిపొయింది. జనాలు, పాటలన్ని డౌన్లోడ్ చెస్కోని విన్నారు కూడ. అసలే యస్.యస్.పి, మంచి బీట్స్ వేసి, క్యాచి లిరిక్స్ తో.. పాటలు వెంటనే నచ్చేలవుంటాయి. ఈ విషయంలో యస్.యస్.పినీ మెచ్చుకోవాలి, ఆడియో రిలీజ్ అయినప్పటినుండి.. మూవీరిలీజ్ అయ్యేంతవరకు బాగావినేసి, వెంటనే డిలీట్ చెసేటట్లు వుంటాయి పాటలన్నీ. అప్పుడప్పుడు మాత్రమే అద్భుతంగా కంపోస్ చేస్తాడు. కానీ గిరిగాడు అలాకాదు. వాళ్ళ హీరో ఫైర్ స్టార్ సినిమా అయితేచాలు, ప్రతీ పాట అద్భుతంగా వుందంటాడు. ఆ బీట్స్ కు, మాహీరో ఎలాంటి స్టెప్స్ వేసుంటాడో.. ఫాన్స్ ఎలా రిసీవ్ చేస్కుంటారో అని అతిగా ఆలోచిస్తూంటాడు. ఫర్స్ట్ లుక్, టీజర్, సాంగ్స్ మరియు ట్రేయిలర్ వీటిలో ఏదైన రిలీజ్ అవ్వడానికి రెండు రోజులముందు నుండే.. మంతనాలు మొదలెడుతాడు. రోడ్డుపైన పోస్టర్లతో సెల్ఫీలూ దిగి ఫేస్బుక్లో పెడుతుంటాడు. వాళ్ళ హీరో పాతసినిమా పంచ్ డైలాగ్స్ అన్నీ.. అదేపనిగా గుర్తుపెట్టుకోని, సందర్భం వస్తేచాలు.. ఫ్రెండ్స్ ముందు పొల్లుపోకుండా చెప్పి నవ్విస్తాడు. తన హీరో స్టయిల్ గురించిగాని, యాక్టింగ్ గురించిగాని, మూవీ కల్లెక్షన్స్ గురించిగాని ఎవ్వరైన తేడాగా మాట్లాడితే అస్సలు సహించడు, వితండవాదం మొదలెడుతాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ బుక్చేయించి, పేపర్ ముక్కల బ్యాగ్ తో ఫ్రెండ్స్ తో కలిసి చూడటం ఆనవాయితి. కాలేజి ఫ్రెండ్స్ తో ఒకసారి, స్కూల్ ఫ్రెండ్స్ తో  ఒకసారి మరియు కజిన్స్ తో ఒకసారి. ఇలా కనీసం మూడుసార్లు  చూడనిదే తృప్తిచెందడు. దాదాపు అన్ని ఫంక్షన్లకు అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కాని పాసెస్ దొరక్కపోవడంతో.. యూట్యుబ్లో లైవ్ చూసుకుంటూ.. కనీసం తరువాతి ఫంక్షన్ కైనా పాసెస్ సాధించాలని అనుకుంటాడు. సినిమా హిట్ అయితే.. "మావాడు ఏదిచేసినా హిట్ అవ్వాల్సిందే" అని, ఒకవేల హిట్కాకపోతే యాంటిఫాన్స్  నెగెటివ్ టాక్ వ్యాప్తింపచేసారనో, థియేటర్లు తక్కువగా ఇచ్చారనో చెప్తాడు. ఇవేవిచాలనట్టు, యూ.యస్.ఎ లో మిలియన్ మార్క్ దాటుతుందో, దాటదో అని ఇంకో టెన్షన్. "తరన్ ఆదర్ష్" ఎప్పుడు ట్వీట్ చేస్తాడో అని అదే పనిగా ట్విట్టర్లో మునిగిపోయుంటాడు. లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ లను ట్యాగ్ చేసి.. కలెక్షన్లు అడిగిన రోజులూవున్నాయి. ఇలా సినిమా పూజ ప్రారంభం నుండి, రిలీజయ్యిన మూడువారాలకు వచ్చిన కలెక్షన్స్ వరకు, ఎన్నో ఆనందాలు, నిరాశనిస్పృహలు, గొడవలు, కాంప్రమైజ్లు. ఇదొక వింత, రంగుల మాయా ప్రపంచం. ఈ ప్రపంచంలో, గిరిగాడు 'పట్టకం' లాంటివాడు. ఒకవైపు నుండి పడే కాంతిని మరచి, మరోవైపువెలువడే ఏడు  రంగులను చూసి మురిసిపోతుంటాడు. ఇదంతా ఫైర్ స్టార్ ప్రతీ సినిమాకు వుండే తంతే, కానీ ఇంకో రెండువారాల్లో రిలీజ్ అవ్వబోతున్న సినిమా ప్రత్యేకమైనది. అచ్చొచిన దర్శకుడు, కలిసొచ్చిన హిరోయిన్. పక్కాహిట్టని ఫిల్మ్ నగరంతా కోడైకూస్తుంది. ఇక ఫాన్స్ గురించీ, ప్రత్యేకంగా గిరిగాడి గురించి చెప్పాల్సిన పనిలేదు.
 
****
 


"డైలాగ్.. డైలాగ్.." అని అభిమానులందరూ అరచినప్పటికీ.. "మూవీ రిలీజ్ అయ్యాకా.. థియేటర్లో చూడండి, జైహింద్" అని చెప్పేసి, ఆడియో ఫంక్షన్ ముగించుకొని, కార్లో ఇంటికి తిరిగి వెల్తున్నాడు మన ఫైర్ స్టార్ "పర్మేష్". ప్రక్కనే బాడిగార్డ్స్, అస్సిస్టెంట్ యస్.కె.రాజు వున్నారు. "ఆహ.. ఎంత జనం.. ఎంత ప్రేమ.. ఏమిచ్చి తీర్చుకోగలమైయ్యా వీళ్ళ అభిమానాన్ని?" అని పర్మేష్, రాజుని అడుగుతాడు. "బాబు.. మనమింకా లిమిటెడ్ పాసెస్ డిస్ట్రిబ్యుట్ చేసాం.. ఇదే ఓపెన్ ప్లేస్లో పెట్టి, ఫ్రీ ఎంట్రీ పెట్టుంటే...దీనికి మూడింతలు వచ్చిండేవారు.. మీ క్రేజ్ ని ఎవ్వరూ బీట్ చేయలేరు బాబు" అని బదులిస్తాడు. "నిజంగా, కేవలం నన్నుచూడ్డానికి, ఎక్కెకడినుండో ప్రయాణాలు చేసొస్తారు. ఆ బ్యానర్లు, ఆ దండలు, సెంటర్లో నాపేరులోని అక్షరాలతో టీ-షెర్ట్స్ అబ్బా… చాలాసేపువరకు నాకు మటరాలేదు, మైమరచిపోయాను. ఆ ఎనర్జీ చూస్తూంటే.. ఇంకా చాలా సినిమాలు తీయ్యాలనిపిస్తుంది. మన ఫాన్స్ అందరూ చల్లగావుండాలి, వాళ్ళకోసం బ్లడ్ బ్యాంక్, -బ్యాంక్ లేదా బోన్ బ్యాంక్ లాంటిది ఎదోకటి పెట్టాలయ్య. ఏజన్మలో చేసుకున్న పుణ్యమో..ఇలా హిరోలా పుట్టి వీళ్ళ ప్రేమాభిమానాలు పొందుతున్నాను, టచ్వుడ్" అని పర్మేష్ అంటాడు. దానికి రాజు "కరెక్టే బాబు. మీరు చాలా అదృష్టవంతులు. ఇందాకే ఫాన్స్ అస్సోసియేషన్ నుండి మెసేజ్ వచ్చింది. సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. 'పిచ్చి పిచ్చుక' పాటైతే అరాచకం అంటా, ఇక ఫస్ట్ డే అయితే ఫాన్స్ కు పునకాలే అని అంటున్నారు."  ఇలా మట్లాడుకుంటూ ఇంటికిచేరుకున్నాడు పర్మేష్. అతనికి రాత్రి నిద్ర పట్టడంలేదు. ఇంకా ఫాన్సే గుర్తొస్తున్నారు. ఒక వ్యక్తిని, మరొకవ్యక్తి  ఇంతలా ఎలా అభిమానించగలడు అని అలోచిస్తున్నాడు. ఆడవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు, వికలాంగులు కేవలం 'నన్ను' చూడ్డానికి తమ పనులన్నీ మానుకొని, డబ్బులు ఖర్చుపెట్టిమరీ వస్తారు. గురువారం సాయిబాబ గుడికిపోయే భక్తులకన్నా శుక్రవారం రిలీజ్ రోజు థియేటర్లకు వచ్చే ఫాన్సే ఎక్కువమంది వుంటారు. నిజంగా నాలో అంతసత్తా వుందా? నిజంగా హిరోలు దైవసమానులా? అని అలోచిస్తూ, "ఈరోజు హాజరైన అభిమానులందరికీ ధన్యావాదాలు. అందరూ ఇళ్ళకు భద్రంగా చేరాలని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేసి పడుకున్నాడు.

****


లైట్స్, కెమెరా.. రోలింగ్ అని ఒక అరుపు, యాక్షన్. "ఆకలేస్తేనే తింటా, దాహమేస్తేనే తాగుతా, దగ్గువస్తేనే దగ్గుతా". కట్. సూపర్బ్ సర్, అని డైరెక్టర్ అరుస్తూ.. పర్మేష్ దగ్గరికి వెళ్ళాడు. "సర్, మీరు ఒక పదినిమిషాలు రిలాక్స్ అవ్వండి, రౌడిల రియాక్షన్స్ తీస్కోని, షాట్ రెడీ అవ్వగానే పిలుస్తా" అంటాడు.  అలా ప్రక్కనే, రిలాక్స్ అవుతున్న పర్మేష్ దగ్గరికి, ప్రోడ్యూసర్, ఇంకో ఇద్దరు తోటి నటులు వచ్చి ముచ్చట్లు పెట్టారు. "ఆడియోకు చాలమంచి టాక్ వచ్చింది. సూపర్హిట్ అంటున్నారు. ఎలాగో ఇంకో రెండు రోజుల్లో షూటింగుకు గుమ్మడికాయ కొట్టేస్తాం కనుక, ఈ ఆదివారం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అనుకుంటున్నాను బాబు.. మీరేమంటారు?" అని పోడ్యూసర్ అడుగుతాడు. నిన్నేకదా ఆడియో ఫంక్షన్ అయ్యింది. మళ్ళీ ఇంకొకటి ఎందుకు? డైరెక్ట్ ట్రైలర్.. ఆతర్వాత మూవీ రిలీజ్ చేసేద్దామంటడు హీరొ. "అలా కాదు బాబు, మూవీ రిలీజ్ అయ్యేవరకు..మనం ఎదో ఒక కరణంగా న్యూస్ లో వుంటే మంచి ప్రమోషన్స్ అవుతాయి, మంచి ఒపెనింగ్స్ కూడా వస్తాయి. ఎప్పటిలా రోటిన్ గా కాకుండా.. ఈసారి కాస్త, ఇన్నోవేటివ్ గా పెడదాం. ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవుదాం. వాళ్ళ ప్రశ్ననలకు సమాధానాలిద్దాం. ప్లీజ్ బాబు ఒప్పుకోండి" అని ఆ ప్రొడ్యూసర్ అంటాడు. ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం అన్న అంశం.. పర్మేష్ ను కట్టిపడేసింది. కాస్త ఆలోచించి, ఆ ఫంక్షన్ కు "సరే" అని చెప్పి, కొన్ని పాసెస్ తనకు కావాల్సినవాళ్ళకోసం పంపమని చెప్పి, లేచి వెల్లిపోయాడు. అందరూ ఆనందపడ్డారు.

****

పిచ్చి పిచ్చుక పాటకి పూనకమొచ్చినోడిలా.. ఫుల్ వాల్యూం పెట్టుకొని, డ్యాన్స్ చేస్తున్నాడు గిరి. ఈ సంబరానికి కారణమెంటి అని అతని ఫ్రెండ్ అడిగాడు. "ప్లాటిన డిస్క్ ఫంక్షన్ పాసెస్ దొరికాయోచ్" అని అరిచాడు గిరి. ఎలా సంపాదించగలిగావని అడగ్గా, ట్విట్టర్లో ఒక కాంటాక్ట్ దొరికిందని, ఆయనకు కాల్ చేయగా మూడు పాసెస్ ఇప్పించాడని చెప్పాడు గిరి. ఎవరైతే ఇన్నిరోజులు ఎగతాళి చేసారో, పాసెస్ తో సెల్ఫీదిగి, వాళ్ళందరినీ ట్యాగ్ చేసాడు ఫేస్ బుక్ లో. ఈ శుభసందర్భంలో స్నేహితులందరూ రూంకు సరుకు తెప్పించుకొని సిట్టింగ్ వెసేసారు. "స్టార్టింగ్లో చాలా బోరింగా వుంటదిరా.. డ్యాన్స్ ఫర్ఫామెన్స్ లని, సింగింగ్ ప్రోగ్రాం లని చాలా వుంటాయి. మన స్టార్స్ లందరూ లేట్ గా వస్తారు" అని ఒక ఫ్రెండ్ అంటాడు. "అదంతా ఆడియో ఫంక్షన్ కు రా.. ప్లాటినం డిస్క్ లో అలాంటివి ఎమీ వుండవు" అని ఇంకొకడు అంటాడు. "ఏదేమైనా, గంటలసేపు వాళ్ళ సుత్తిని తట్టుకోవాలంటే.. మనమాత్రం పక్కాగా రెండు పెగ్గులు వేస్కోని వెళ్ళాల్సిసందే" అని మరొకడు అనగా.." నిజమే రోయ్, ఎంత సుత్తికొట్టినా.. మన ఎనర్జీ లెవల్స్ అస్సలు డౌన్ అవ్వకూడదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాక, సేం ఎనర్జీ లెవల్స్ ప్రదర్శించాలి" అని అందరు తిర్మానించుకుంటారు.    

****

ఆదివారం సాయంత్రం, ఏడు గంటలసమయం . తోటినటీనటులు మాట్లాడాకా, తమరు ఎంట్రి ఇస్తే బాగుంటుందని, లేకపోతే వాళ్ళు చెప్పేది ఎవ్వరూ వినరని కొందరి సలహామేరకు, వేయిటింగ్ రూంలో పర్మేష్ వేయిట్ చేస్తున్నాడు. తను ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో చెప్తానని చెప్పి, మేనేజర్ డోర్ పెట్టేసి వెళ్ళాడు. సరే, ఎలగో టైం వుందికదాని, కూర్చోని మ్యాగజైన్ చదవడం మొదలెట్టాడు పర్మేష్. ఇంతలో వాష్ రూం నుండి సౌండ్స్. ఎవరైయ్యుంటారో అని ఖంగారుగ అలోచిస్తూ, చేతిలోని మ్యాగజైన్ ప్రక్కనపెట్టి.. నిలబడ్డాడు. డోర్ ఒపెన్ అయ్యింది. వాష్ రూం నుండి గిరి తూగుతూ బయటకొచ్చాడు. "ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వొచ్చావు?" అని అడిగాడు పర్మేష్. "నా సంగతి సరే.. ఇంతకీ నువ్వెవడివిరా.. అచ్చం..నేను దండేసే కటౌట్లా వున్నావు?" బదులిచ్చాడు గిరి. వీడెవడో తప్పతాగి, దారితప్పి వేయిటింగ్ రూంలో దూరిన తన ఫాన్ అని పర్మేష్ కు అర్థమవ్తుంది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి పంపించడం కుదరదని,  కాసేపు ఆగితే, ఇద్దరం వెళ్ళొచ్చని చెప్పి గిరిని అక్కడే కుర్చోబెట్టి తన మ్యాగజైన్ చూస్తూ కూర్చుంటాడు పర్మేష్. ఇంకా మత్తులోనె వున్న గిరి తనప్రమేయం లేకుండానే పిచ్చి పిచ్చుక పాటను హంచేయడం మొదలెడుతాడు. ఎలగో స్టేజ్ మీదకు వెళ్ళడానికి ఇంకో పది నిమిషాలు పడుతుంది కాబట్టి, వీడితో కాసేపు మాట్లాడితే మంచిదని, ఫాన్స్ తన గురించి ఎగ్జాట్ గా ఎమనుకుంటున్నారో తెలుసుకోడానికి ఇదొక మంచి అవకాశమనుకొని బాగా ఆలోచించి డైరెక్ట్ గా "ఒక హిరోని  ఎందుకు అంతలా అభిమానిస్తారు?" అని అడిగాడు పర్మేష్. "అభిమానమా.. బొక్కా.. ఎదో మాథీఠ కొద్ది ఇవన్నీ చేస్తాంగాని.. ఫాన్స్ లేదు..తొక్కలేదు" అని మత్తులో వాగేసాడు గిరి. ఒక్కసారి పర్మేష్ షాక్ అయ్యాడు.  వీడెవడో గాని చాలా పచ్చిగా సమాధానాలు ఇస్తున్నాడని అశ్చర్యపొయి, ఇక ఎమీ అడగొద్దని అనుకుంటడు. కానీ ఆపుకోలేక, పద్దతిగ "మరీ ఎందుకీ ఫాన్స్ అస్సోసియేషన్స్? మూవీ రిలీజ్ రోజు కట్ అవుట్ లూ?" అంటాడు. తను ఎక్కడున్నాడో, ఎవ్వరితో వున్నాడో తెలియని గిరి "అరే..అన్నా.. మాఇష్టమన్నా, చెప్పుకోడానికో.. చూపించుకోడానికో.. మాక్కూడ కొంచెం కంటెంట్ వుండాలి కదా? అమ్మాయిలతో మాటలు కలిపేందుకో, ఫ్రెండ్స్ లలో గుర్తింపు తెచ్చుకునెందుకో.. ఎవో మా కష్టాలు మావి" అని బదులిచ్చాడు. "మరి ఏ ఫంక్షన్ పెట్టినా.. ఎగేసుకొని గుంపులుగా వస్తారు.. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నానా హంగామా చేస్తారు.. ఇదంతా కూడా..డ్రామానా?" నిరాశతో అడిగాడు పర్మేష్. "ఇప్పుడూ..బయట అంతమంది వున్నారూ, అందరూ..మీ బాగోగులు చూడడానికి వస్తారనుకున్నావా? అబ్బే.. అలాంటిదేంలేదు బాబ్జీ.. మాక్కూడా..చాల పనులుంటాయి.. ఏం చేయాలో  తోచనప్పుడు.. ఇదిగో..ఇలా. మీమీద పడేస్తూంటాం.. మీరు గొప్పహీరోలని అనిపించుకోడానికి ఎలా ట్రై చేస్తారో..మేమూ.. గొప్ప ఫాన్స్ అని అనిపించుకోడానికి అంతే ట్రై చేస్తాం. ఆల్రెడి ఎవడి బాధలువాడికుంటాయి.. ఇక మీ బాధకూడానా మాకు? అంత లేదు రాజా.. అంతా డ్రామానే.. మీరెంతో..మేమంతే". ఫాన్స్ ప్రేమాభిమానాలగురించి చాలా గొప్పగా ఆలోచించినందుకు, పర్మేష్ సిగ్గు పడ్డాడు. కానీ గిరి "గుర్తుపెట్టుకో.. మాకు బోర్ కొడితేనే..మిమ్మల్ని చూస్తాం, మీ సినిమాలూ చూస్తాం. వెరే పనులుంటే మీరు మాకెందుకు గుర్తొస్తారురా? ఇప్పుడు ఇంతమంది బయట వున్నారంటే..దానర్థం. అంతమందికి..కాలక్షేపానికి ఇంకేది దొరకలేదని అర్థం... లేదా.. వాడు చేసే బిజినెస్ ఇదేనని అర్థం" అని కూడా అనేసాడు. పర్మేష్ కు నోట్లో మాటరావట్లేదు. ఏం అడగాలో అర్థంకావట్లేదు. "మరీ రక్తదానాలూ.. సొంత డబ్బుతో అన్నదాన కర్యక్రమాలు.. ఇవన్నీ చెస్తారు కదా..?" అని నెమ్మదిగ అడిగాదు పర్మేష్. "పబ్లిసిటీ...చెప్పాకదా.. నువ్వెంత ఓవర్ చేస్తే..మేమంత ఓవర్ చేస్తాం. సభలో..మేమురాజులైతే.. మీరు నర్తకులురా.. మమ్మల్ని.. ఎంటర్టైన్ చేస్తేనే మీ లైఫ్" మత్తులోని గిరి నొక్కిచెప్పాడు. ఇంతలో..మేనేజర్ డోర్ ఓపెన్ చేసి , "సర్, ఇక మనం స్టేజ్ పై ఎంట్రి ఇవ్వొచ్చు" అని అంటాడు. డోర్ ఓపెన్ అయిన ఆనందంలో..గిరి  "జై ఫైర్ స్టార్.. జై జై పర్మేష్ బాబు" అని అరుచుకుంటూ.. బయటకు వెళ్తాడు. "వీడెవడు బాబు? ఇక్కడికి ఎలా వచ్చాడు?" అని ఆశ్చర్యంతో అడుగుతాడు మేనేజర్. అప్పటికే పర్మేష్ ముఖం..ఆయిల్ తక్కువై మాడిపోయిన ఆంలెట్ లా.. తయారైయ్యింది. ఎక్ప్రెషన్ మార్చి, లేచి నిలబడి, అన్నీ.. సరిచూసుకోని ఆడిటోరియుంలోకి వెళ్తాడు పర్మేష్. పెద్దగా అరుస్తున్నారు అభిమానులు. ఫోటోలు తీస్తున్నారూ జనాలు. నిజమే తాను కేవలం, సినిమా ప్రపంచానికి రాజునేమోగాని, ప్రపంచం అనే సినిమాలో ఒక మామూలు పాత్రేనని, రాజులు ఇంకా చాలామంది వున్నారని అనుకుంటూ..అలా...మౌనంగా స్టేజీమీద నిలబడ్డాడు.

                                                                                                   - ఆరిఫ్.టి.యం.డి.

1 కామెంట్‌: